ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం ఉభయగోదావరి జిల్లాల్లో ఈ రబీలో పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని జలవనరులశాఖ అంచనాకు వచ్చింది. రెండు జిల్లాల్లో మొత్తం 8.96 లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత పెట్టవలసిందేనని లెక్కలు కట్టారు. డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు గోదావరి, సీలేరు, బలిమెల తదితర చోట్ల ఉన్న నీటిని లెక్కలు కట్టి- సీలేరు జలవిద్యుత్తు కేంద్రం అధికారులను సంప్రదించి ఈ అంచనాకు వచ్చారు. పోలవరం నుంచి కూడా కొంత నీరు తీసుకోవచ్చని అంచనాలు వేసిన తర్వాతే 2.50 లక్షల ఎకరాల వరకు కోత పెట్టాలన్నది లెక్క. పోలవరంలో నీళ్లు నిల్వ ఉంచితే ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతుందనుకుంటే సాగు విస్తీర్ణాన్ని మరింత తగ్గించాల్సి వస్తుందన్నారు.
ఈ విషయాలన్నింటిపై జలవనరులశాఖ ప్రభుత్వానికి నివేదించింది. నీటిపారుదల సలహామండలి సమావేశం ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాల తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సాగుచేస్తే నీళ్లందక రైతులు పెట్టుబడులు కోల్పోయే పరిస్థితులు వస్తాయని జలవనరులశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రబీ పంటకు సీలేరు నీరు ఇవ్వలేమని జెన్ కో అధికారులు జలవనరులశాఖ అధికారులకు లేఖ రాశారు.ఏటా విద్యుదుత్పత్తి చేస్తూనే అదనంగా 15-20 టీఎంసీలు గోదావరి రబీ సాగుకు నీరు ఇచ్చే సీలేరు పరీవాహకం ఈసారి ఆసరాగా నిలబడలేకపోతోంది. జనవరి తర్వాత విద్యుదుత్పత్తి కష్టమేనని జెన్ కో అధికారులు అంటున్నారు. సీలేరు అండ లేకపోతే రబీ కష్టాలు ఎక్కువేనని అధికారులు పేర్కొంటున్నారు.