గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని వరాహపురం గ్రామంలో వెద పద్ధతి ద్వారా వేసిన పంట నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందారు. ఈ క్రమంలో తమ పొలాలకు వచ్చే కాలువలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్వేత అక్కడికి చేరుకున్నారు. అధికారిణి ముందు మహిళా రైతులు కంటతడి పెట్టుకుని తమకు నీళ్లు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగునీరు ఇవ్వకపోతే.. చావే దిక్కు - Farmers protest in Varahapuram
లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా పోతున్నా.. వెద పద్ధతి(ట్రాక్టర్ ద్వారా విత్తు నాటటం) ద్వారా సాగు చేస్తున్న తమకు నీరు అందటం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వరి పొలాల్లో నీరు లేక ఎండిపోతున్నాయని మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. తమకు త్వరితగతిన నీళ్లు అందించి.. పంటను బతికించాలని అన్నదాతలు కాలువల్లో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి పంట వేశామని.. నీరు లేక దెబ్బతింటే తమకు చావే దిక్కని విలపించారు. పైనుంచి నీళ్లు వదిలి వారం రోజులు అయినా.. తమ ప్రాంతానికి చుక్కనీరు కూడా రావడం లేదని వాపోయారు. అందుకు కాలవ పూడిక ప్రధాన కారణమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రైతులకు శ్వేత సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమకు నాలుగు రోజులు సమయం ఇవ్వాలని అన్నదాతలను ఆమె కోరారు. కాలువలో మెరికలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే పంట పొలాలకు నీరు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ..High Court: గ్రామ సచివాలయ నిర్మాణం నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు