తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండో రోజూ భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, సీతానగరం, పెద్దాపురం, తాళ్లరేవు, అంబాజీపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, కాజులూరు, కె.గంగవరం, రాజవొమ్మంగి ప్రాంతాల్లో వాన తీవ్రత అధికంగా ఉంది. వర్షం ధాటికి రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. మోరంపూడి జంక్షన్ సమీపంలోని కోనేరుపేట, వి.ఎల్.పురంలో ఇళ్లు మునిగాయి.
వరద గుప్పిట్లో ఏలేరు పరివాహక ప్రాంతం....
ఏలేరు పరివాహక ప్రాంతం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్న జలాశయంలోకి 25 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రతకు జలాశయానికి 35 చోట్ల గండ్లు పడ్డాయి. కిర్లంపూడి మండలంలో అనేక గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. కిర్లంపూడి మండలం జగపతినగరం, రాజుపాలెం, ముక్కోలు గ్రామాలను వరద ముంచేసింది. వరద నీరు వెళ్లేందుకు రాజుపాలెం ప్రజలు గండి కొట్టడంతో.... ముక్కోలు వాసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండూళ్ల మధ్య స్పల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలో వర్ష బీభత్సం పొంగిన వాగులు...
గొల్లప్రోలు మండలం కూడా వరద పాలైంది. వందలాది ఇళ్లలోకి నీరు చేరింది. లక్ష్మీపురం, సీతానగరం, మల్లవరం, చేబ్రోలు, తాటిపర్తి, గొల్లప్రోలులో... వేల ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి, మిరప, ఉల్లి, కూరగాయల పంటలు నీట మునిగాయి. ఏలేరు వరదతోపాటు సుద్దగడ్డ వాగు పొంగి పొర్లడంతో... 6వ నెంబర్ జాతీయ రహదారితోపాటు ఇతర రోడ్లు జలమయమయ్యాయి. పెద్దాపురం-గుడివాడ, సామర్లకోట-పిఠాపురం రహదారులను వరద ముంచెత్తింది. జగ్గంపేట మండలం రామవరం వద్ద పోలవరం కాల్వకు గండి పడటంతో... జాతీయ రహదారి నీటిలో చిక్కింది.
తూర్పుగోదావరి జిల్లాలో వర్ష బీభత్సం పంటలకు తీవ్ర నష్టం
ఎడతెరిపిలేని వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కడియం మండలంలో పంటలు నీట మునిగాయి. కడియం ఆవ పరిసర ప్రాంతాల్లో సుమారు 12 వందల ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. కోనసీమ వ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో పంట పొలాలు నేలకొరిగాయి. అరటి, కంద, కూరగాయల తోటలు ముంపు బారిన పడ్డాయి. మురుగు కాలువల ద్వారా భారీగా వరద గోదావరిలోకి చేరుతున్నా.... పంట పొలాల్లో మాత్రం నీరు తగ్గుముఖం పట్టడం లేదు.
ఇదీ చదవండి: