ఆహ్లాదాన్ని పంచే వాతావరణం.. వేల రకాలు మొక్కలు.. సుగంధాలు వెదజల్లే పూలు. కనువిందు కలిగించే భిన్నరంగుల్లోని మొక్కలు. పర్యావరణ ప్రియులకు, మొక్కలు పెంచేవాళ్లకు కడియం నర్సరీలంటే ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ ప్రాంతం మొత్తంగా పచ్చదనంతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కరోనా ప్రభావంతో..గత రెండేళ్లుగా నర్సరీ పరిశ్రమ చతికిలబడింది.
మొక్కలు కొనేవాళ్లు లేక, సందర్శకులు రాకపోవటంతో నర్సరీ యజమానులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వేసవిలో మొక్కల సంరక్షణకు కూలీలు అందుబాటులో లేక తీవ్రంగా ఇబ్బందులు పడిన పెంపకందారులు.. అష్టకష్టాలు పడి మొక్కలను సంరక్షించినా కొనేవాళ్లు లేక మరింత సతమతమవుతున్నారు. కడియం నర్సరీలు 5 వేలకుపైగా ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రత్యక్షంగా 60 వేల మంది పరోక్షంగా మరో 50 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.