Couple suicide by online money lending apps: ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న కన్నబిడ్డలను వదిలేసి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ రుణయాప్‌ల కారణంగానే వీరు బలవన్మరణం పొందినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు పదేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చారు. ఆరేళ్ల కిందట రమ్యలక్ష్మితో వివాహమైంది. నగరంలోని శాంతినగర్‌లో నివాసముంటున్నారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం. దుర్గారావు పెయింటింగ్, రమ్యలక్ష్మి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి యాప్‌ల నిర్వాహకులు
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల వీరు రెండు ఆన్‌లైన్ రుణయాప్‌లలో కొంత మొత్తం నగదు అప్పుగా పొందారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోవడంతో యాప్‌ల నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. వారి బెదిరింపులను తాళలేక కొంత మొత్తం నగదును చెల్లించారు. మరింత చెల్లించాలని, లేదంటే రమ్యలక్ష్మి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. ఈ బాధలు తప్పించుకోవాలనే ఉద్దేశంతో దుర్గారావు పది రోజుల కిందట ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌గా చేరి అదనపు సంపాదన కోసం ప్రయత్నించారు. ఈలోగా అసభ్యకరంగా ఉన్న ఓ చిత్రానికి రమ్యలక్ష్మి ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసి యాప్‌ల నిర్వాహకులు వాట్సాప్‌లో బెదిరించారు. రెండు రోజుల వ్యవధిలో పూర్తి రుణాన్ని వడ్డీతోసహా చెల్లించకుంటే ఈ చిత్రంతోపాటు అసభ్యకరంగా వీడియోను తయారు చేసి పంపుతామని హెచ్చరించారు. దాంతో గుండెపగిలిన దంపతులు, నిస్సహాయస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.