తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రజలు ఏమాత్రం అనుమానం ఉన్నా స్వచ్ఛందంగా దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో చేసే పరీక్షలు మినహాయిస్తే జిల్లాలో అయిదుచోట్ల కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌తోపాటు బొమ్మూరు క్వారంటైన్ కేంద్రంలో ఉచితంగా స్వాబ్ నమూనాలు సేకరించి, పరీక్షలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా కరోనా పరీక్ష చేయించుకోవాలనుకున్న వ్యక్తి ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆరు దశల్లో రిపోర్టు పొందవచ్ఛు ఉదాహరణకు కరోనా పరీక్ష కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి ఓ వ్యక్తి వెళితే ఇలా పరీక్ష చేస్తున్నారు.
1 ఆధార్ రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని రెండు విభాగాలుగా చేశారు. కరోనా, సాధారణ ఆసుపత్రిగా విభజించారు. కరోనా ఆసుపత్రికి వెళ్లేవారికి ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వార్డులోని ఓపీ కేంద్రం వద్ద ముందుగా పేరు నమోదు చేయించుకోవాలి. మనకు వచ్చిన నంబరు ఆధారంగా పేరు వచ్చినప్పుడు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నంబరుతో ఓపీ కేంద్రం వద్దకు వెళ్తే వివరాలు నమోదు చేసుకుని వైద్యుల వద్దకు పంపిస్తారు.
2 ఓపీలో వైద్యుల సూచనలు..
మీరు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వచ్చారు.. వంటి వివరాలు వైద్యులు తెలుసుకుంటారు. థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఉష్ణోగ్రతను తెలుసుకుని ఐసీఎంఆర్ రిజిస్ట్రేషన్‌కు పంపిస్తారు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే వారిని ఫలితం వచ్చే వరకు ఆసుపత్రి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తారు.
3 ఐసీఎంఆర్‌లో వివరాలు
ఐసీఎంఆర్ పత్రంలో మీ వివరాలు నమోదవుతాయి. అక్కడికి ఓపీ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఈ పత్రాలను రూపొందిస్తారు. స్వాబ్ తీసేందుకు వ్యక్తి అందుబాటులో ఉన్నాడా? లేదా? అని తెలుసుకునేందుకు పేరు పిలిచి కిట్‌లు పొందేందుకు పంపిస్తారు.