తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్.. పంజా విసురుతోంది. తొలి దశ కంటే జోరుగా రెండో దశలో జిల్లా మొత్తాన్నీ చుట్టేసింది. ఆరంభం నుంచి పాజిటివ్ కేసులు 1.50 లక్షలు దాటేశాయి. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు తూర్పునే నమోదయ్యాయి. రోజు వారీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. అయినా.. ఏ మాత్రం.. కలవరం దరి చేరనీయొద్దు. మన ఇల్లు.. మన వీధి.. మన ఊరు.. అందరూ బాగుండాలనే లక్ష్యంతో మసలుకుందాం. కర్ఫ్యూ నిబంధనల మేరకు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. మహమ్మారిపై సమర శంఖం పూరిద్దాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్న హెల్త్‌కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అండగా నిలుద్దాం. అధికార యంత్రాంగం అహరహం శ్రమిస్తున్న వేళ అందరవ΄ చైతన్యులమై కొవిడ్‌ను కట్టడిచేద్దాం.
జాగ్రత్తలు.. అవశ్యం
- ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు తగ్గించుకోవాలి.
- కొవిడ్ లక్షణాలు ఉంటే సత్వరమే పరీక్షలకు రావాలి
- ఫలితాలు వచ్చే వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగొద్దు.
- కొవిడ్ బాధితుల సహాయకులు నిర్దేశిత నిబంధనల మేరకు తప్పక మసలుకోవాలి.
స్పందిద్దాం... సహకరిద్దాం..
తొలి కొవిడ్ కేసు నిరుడు మార్చి 21న నమోదవగా.. అప్పటి నుంచి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో కీలక శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ః కొవిడ్ పరీక్షలు, కొవిడ్ సేవలు, ల్యాబ్‌ల పర్యవేక్షణ.. హోమ్ ఐసోలేషన్, ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలను జేసీ కీర్తి పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, బాధితులకు మందులు, భోజనం, పారిశుద్ధ్యం అంశాలను జేసీ లక్ష్మీశ పర్యవేక్షిస్తున్నారు.
కొవిడ్ కంట్రోల్ రూమ్, 104 సేవలు, హెల్ప్‌డెస్క్, కొవిడ్ కేర్ సెంటర్లతో మరిన్ని సేవలు దరి చేరేలా అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సత్తిబాబు చూస్తున్నారు. క్షేత్రంలో సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. విపత్తులోనూ వెన్నుచూపని వీరి సేవలకు ప్రతి ఒక్కరం సహకరిద్దాం..