ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో 12వేలు దాటిన కేసులు.. ప్రమాదకరంగా 30 మండలాలు - covid news in east godavari dst

తూర్పుగోదావరి జిల్లాలోపాజిటివ్‌ కేసులు ఏకంగా 12 వేలు దాటాయి.. మరణాలు శతకం దాటేశాయి. గతి తప్పుతున్న పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలో 64 మండలాలు ఉంటే.. అందులో 30 మండలాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా (వెరీ యాక్టివ్‌) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

coivd cases in east godavari dst are increasing very fastly
coivd cases in east godavari dst are increasing very fastly

By

Published : Jul 26, 2020, 2:46 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 64మండలాల్లో 30 మండలాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆయా మండలాల్లో కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలనీ.. వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి అని పదేపదే హెచ్చరిస్తున్నా.. ఇంకా కొందరు అదే పనిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కరోనా కాటేస్తూ కుటుంబీకులకు చివరి చూపు కూడా నోచని హృదయ విదారక ఘటనలు జిల్లాలో తారసపడుతున్నా.. చంటి పిల్లలను సైతం ఒంటరిగా ఆసుపత్రులకు పంపాల్సిన ఘటనలు ఎదురవుతున్నా.. కొందరు ఉదాసీనత వీడకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

జిల్లాలో కరోనా తొలి పాజిటివ్‌ కేసును మార్చి 21న గుర్తించారు. మొదట్లో కేసులు పదుల సంఖ్యలో ఉన్నా.. ఈనెలలో వెయ్యికి తగ్గకుండా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య 12,483కి చేరింది. ప్రజలు సహకరిస్తే తప్ప పరిస్థితి కుదుటపడే సూచనలు కన్పించడం లేదు.

  • 28 రోజుల పర్యవేక్షణ..

జిల్లాలో కేసుల తీవ్రత 28 రోజుల్లో ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెరీ యాక్టివ్‌ కేసులున్న ప్రాంతాలుగా గుర్తిస్తారు. జులై 1 నుంచి పరిశీలిస్తే జిల్లా కేంద్రం కాకినాడ.. రాజమహేంద్రవరం ఇతర మండలాల్లోనూ కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఐదు రోజులుగా పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో వెలుగు చూస్తుండటం కలవరపరుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత రోగులను గుర్తిస్తున్నారు. పల్స్‌ ఆక్సీమీటర్‌తో పరీక్షించి అనుమానిత లక్షణాలున్న వారితోపాటు.. 60 ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి కంటైన్మెంట్‌ జోన్‌నూ ప్రతి ఒక్కరి ఆరోగ్యస్థితి తెలుసుకునే దిశగా సర్వే చేస్తున్నారు.

  • ఫీవర్‌ క్లినిక్‌లతో కార్యాచరణ..

ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో ఫీవర్‌ క్లినిక్‌లు ప్రతి కంటైన్మెంట్‌ జోన్లలో ఏర్పాటుచేసి.. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఎక్కువ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఎక్కువ కేసులను గుర్తించి కరోనా కట్టడి చేయాలనేది అధికారులు నిర్దేశించుకున్న తాజా లక్ష్యం.

  • సహకరిస్తేనే కట్టడి..

వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్న మండలాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఏర్పాటుచేసి.. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

  • తక్షణ వైద్య సేవలు అందిస్తాం..

కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. ఎక్కువ పరీక్షలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనాకు మందు లేదు. చికిత్స లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే వీలుందని తెలిపారు

ఇదీ చూడండి

ఏవోబీలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి

ABOUT THE AUTHOR

...view details