Jagananna Vidya Deevena Scheme : పేద కుటుంబాల పిల్లలు చదువు ద్వారా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సాహాలు అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. విద్యా పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే నాలుగేళ్లలో అక్కాచెల్లెళ్ల ఖాతాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు నగదు జమ చేశామన్న జగన్.. తాను ఇంతలా పేదల కోసం తపిస్తుంటే ప్రతిపక్షాలు అందరూ తోడేళ్లులా కలిసి వచ్చి తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలంతా తనకు అండగా నిలవాలని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యాదీవెన సభలో పాల్గొని ప్రసంగించారు.
బస్సులో రోడ్ షో:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటించారు. జగనన్న విద్యాదీవెన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. కొవ్వూరు హెలికాఫ్టర్ లో చేరుకున్న సీఎం...అక్కడి నుంచి హోం మంత్రి తానేటి వనిత క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభ వద్దకు బస్సులో రోడ్ షో నిర్వహించారు.నిరుపేదలు సామాజికంగా ఎదగాలన్నా, వివక్ష పోవాలన్నా.. వారికి చదువే గొప్ప అస్త్రమని జగన్ అన్నారు. 9 లక్షల 95 వేల మంది పిల్లల తల్లుల ఖాతాల్లో 703 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జమ చేశారు. విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు 10 వేల 636 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు. విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా చదువుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయన్న సీఎం... ప్రతి పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలని పిలుపునిచ్చారు.