తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంతో అప్రమత్తమైన ప్రభుత్వం... దుర్ఘటనల నివారణపై దృష్టి పెట్టింది. ఆ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. జల వనరులు, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బోటు ప్రమాద ఘటన, కారణాలు, భద్రత చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు.
ప్రమాదాల నివారణ, భద్రత కోసం 8 చోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. స్థానిక తహసీల్దారు ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ సెంటర్లు పనిచేస్తాయి. జల వనరులు, పర్యాటక శాఖ, పోలీసులు, తదితర విభాగాల నుంచి సిబ్బందిని నియమించనున్నారు. ప్రతీచోట కనీసం 13 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ముగ్గురు పోలీసులు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.
ఈనెల 21న... 8 కంట్రోల్ రూంల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని చెప్పారు. 90 రోజుల్లో వాటి సేవలు అందుబాటులోకి రావాలన్నారు. బోట్లు ప్రయాణించే మార్గాలు, వరద ప్రవాహాలపై సమాచారం తీసుకుంటూ... పడవల కదలికలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కంట్రోల్ రూంల పరిధిలో పడవలు, జెట్టీలు ఉండాలన్న సీఎం... ప్రయాణీకులకు టిక్కెట్లు ఇచ్చే అధికారం కంట్రోల్ సెంటర్లకే ఇవ్వాలని నిర్దేశించారు. పడవల్లో ఎట్టి పరిస్థితుల్లో మద్యం వినియోగం ఉండకూడదని స్పష్టం చేశారు.
సిబ్బందికీ శ్వాస పరీక్షలు నిర్వహించాలని... బోట్లకు జీపీఎస్ అమర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. బోట్లన్నీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. కంట్రోల్ సెంటర్లలో సిబ్బందిని వీలైనంత త్వరగా నియమించి... 3 నెలలపాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా సిబ్బంది చూడగలిగితే... గ్రేడింగ్ ప్రకారం వారికి కనీసం 2 నెలల జీతం నజరానగా ఇవ్వాలని సీఎం సూచించారు. బోట్లలో పనిచేసే వారికీ శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శిక్షణ పొందినవారికే పని చేయడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.