ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'నాడు-నేడు' పథకం తొలి దశ పూర్తయింది. 60 వేల 469 బడులు, వసతిగృహాలు, కళాశాలలకుగానూ.. తొలివిడతలో 15వేల 715 పాఠశాలల్లో 3వేల 669 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, చిన్న, పెద్ద మరమ్మతులు లాంటి పనులతో విద్యాసంస్థల ఆవరణను ఆహ్లాదంగా తీర్చిదిద్దింది. తొలిదశ ఆధునికీకరణ, గదుల నవీకరణ పూర్తయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లనున్న సీఎం.. తొలి దశలో పనులు పూర్తి చేసుకున్న బడులను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు పాఠశాలకు రానున్న సీఎం.. అక్కడే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం పలుమార్లు ఆటంకం కలిగించినా ఏర్పాట్లను పూర్తి చేశారు.
హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాకానుక..
రెండో విడత నాడు-నేడు పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. నూతన విద్యావిధానాన్ని అనుసరించి.. రానున్న రెండేళ్లలో బడులు, హాస్టళ్లు, కళాశాలల్లో 16వేల 21కోట్లకుపైగా పనులకు వెచ్చించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కారీ బడుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు విద్యాకానుక కింద కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికీ 3 జతల యూనిఫాం, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, స్కూల్ బెల్టు, మాస్కులు అందించనున్నారు. ఈ ఏడాది వీటికి అదనంగా డిక్షనరీ పంపిణీకి నిర్ణయించారు. 1 నుంచి 5వ తరగతి వారికి ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిక్షనరీని.. 6నుంచి 10వ తరగతి వారికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఇవ్వనున్నారు.