CM Jagan Comments On Polavaram: పోలవరంపై నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై ముఖ్యమంత్రి జగన్ పాతపాటే పాడారు. పోలవరం కట్టేది తాను కాదని.. కేంద్రమే కడుతున్నందున వాళ్లు ఎప్పుడిస్తే అప్పుడే పునరావాసం అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. 2025 ఖరీఫ్‌కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి 41.5 మీటర్ల ఎత్తు వరకూ నీళ్లు నిలుపుతామని జగన్ చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో పర్యటించారు. హెలీప్యాడ్‌కు దగ్గర్లో ఏర్పాటు చేసిన వ్యూపాయింట్ నుంచి గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం ఇటీవలి వరద ముంపు, సహాయ చర్యలపై అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. వ్యూపాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
Interview with CMవరద బాధితులకు సహాయ చర్యలు అందుతున్నాయో లేదో పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం అధికార పార్టీ భజన సభలా మారింది. సీఎంతో ముఖాముఖిలో.. 8మంది మాట్లాడితే వారిలో ముగ్గురు సర్పంచులు, ఒక గృహసారథి ఉన్నారు. మిగతా నలుగురూ ముందురోజు అధికారులు ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినవారే. వారంతా ప్రభుత్వాన్ని పొగుడుతూనే మీరేమైనా చేయండి.. పునరావాస ప్యాకేజీత్వరగా ఇచ్చి తరలించండి అని ముఖ్యమంత్రిని కోరారు.
Polavaram Residents ఇక నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ(Relocation package), పునరావాసంపై జగన్ పాత పాటేపాడారు. కేంద్రాన్ని అడుగుతున్నామని.. వాళ్లిస్తే పునరావాసం అమలు చేస్తామని చెప్పారు. గతేడాది చింతూరులో వరద బాధితులను పరామర్శించినప్పుడు కూడా సీఎం అవే మాటలు చెప్పారు. సీఎం మళ్లీ అదే పాటపాడడంతో.. బాధితుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ నెలాఖరునాటికి 41.5 కాంటూరు పరిధిలో పునరావాసానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉందంటూ ముంపు బాధితుల్ని జగన్ మరోసారి ఊరడించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కొందరు సచివాలయ ఉద్యోగులు, మహిళా సంరక్షణ కార్యదర్శులకు హెలీప్యాడ్ వద్ద బందోబస్తు విధులు కేటాయించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని బందోబస్తు విధులకు కేటాయించబోమని ఇటీవల డీజీపీ (DGP) హైకోర్టు దృష్టికి తెచ్చినప్పటికీ కుక్కునూరు ఎంపీడీవో వారికి బందోబస్తు విధులు కేటాయించడం చర్చనీయాంశమైంది.