Minister press meet on grain procurement issues: రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందించి, లాభసాటి వ్యవసాయం ద్వారా ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే సీఎం జగన్ అశయం అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంత్రి పర్యటించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు, నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
అకాల వర్షాలు వలన ఏ రైతుకు నష్టం జరగాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లాలో జయ బొండాలు 12 వేలు ఎకరాల వరకూ ఊడ్చారని అవి ఏలూరు బాయిల్డ్ రైస్ మిల్లుకు తరలిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. నిన్నటి వరకూ 7.650 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించామని, నేడు వాతావరణం బాగుడటంతో 8 లక్షల మెట్రిక్ టన్నులు దాటిందని అయన అన్నారు.
రైతులు పండించిన ప్రతి ధ్యానం గింజను కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కారుమూరి తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంట గ్రామాలలో తడిచిన ధాన్యాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మిల్లర్లు నూక శాతం పేరుతో నగదు వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నగదు చెల్లిస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని రైతులు వాపోయారు. వెంటనే సంబంధిత మిల్లుల యాజమానులతో ఫోన్ లో మాట్లాడారు. ధాన్యం సకాలంలో దిగుమతి చేసుకోకపోతే మిల్లులను సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పన్నెండు రైస్ మిల్లులను సీజ్ చేసామని మంత్రి చెప్పారు.
ధాన్యం రాశుల వద్దకు తీసుకెళ్లకుండా ఆరబెట్టిన తడిచిన ధాన్యం వద్దకు తీసుకెళ్లడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ధాన్యం కళ్లాల్లో ఉండిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు లారీల సమస్య తీవ్రంగా ఉందని రైతులు విన్నవించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా ఈ ప్రాంతంలో డీసీఎంఎస్ ద్వారా ధ్యానం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు సమకూర్చలేకపోతే డీసీఎంలను మార్చాలని మంత్రి ఆదేశించారు.