రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంటే ఇళ్ల స్థలాలకు భూములు సేకరణ పేరుతో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ, రాజానగరం నియోజకవర్గాలలో లోతట్టు ప్రాంతాలను ఇళ్ల స్థలాలకై భూములు సేకరిస్తున్నారని, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నివాసయోగ్యానికి పనికిరాని భూములకు రెట్టింపు రేట్లు చెల్లిస్తున్నారన్నారు. ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలనుకున్న మడ అడవుల భూములకు కేంద్రం అడ్డుకట్టవేసిందన్నారు.
ఆదాయం కోసమే మద్యం రేట్లు పెంచి అమ్మడానికి అనుమతి ఇచ్చారని చినరాజప్ప ఆక్షేపించారు. మద్య నిషేధం విధానమని చెప్పిన వైకాపా దానిపై ఆదాయానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. సేల్స్ టాక్స్ పోయినందున ఆదాయం కోసం లాక్డౌన్లోనే దుకాణాలు తెరవాలని తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు.