విభజన అనంతరం రాష్ట్రానికి ఆదాయం తెచ్చే రాజధాని అవసరమన్న ఆలోచనతోనే అమరావతి నిర్మాణం చేపట్టామని మాజీమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. అమరావతిలో సచివాలయం, శాసనసభ, కోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టామన్న ఆయన... రాజధాని ఏర్పాటుకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం.. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.
శాసనసభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులపై చేసిన ప్రకటన.. ప్రజల్ని ఆందోళనకు గురిచేసిందన్నారు. గత ప్రభుత్వంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. వైకాపా తీరు రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఆవేదన చెందారు. రాష్ట్రాన్ని నాశనం చేసే దిశగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్న ఆయన.. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో వికేంద్రీకరణ జరగాలి కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేలా కాదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు.