హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ వైకాపా నేతలు రాక్షసానందం పొందుతున్నారని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పథకం ప్రకారం హిందూ సంస్కృతిపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను కన్నబాబు సమర్థించడాన్ని చినరాజప్ప ఖండించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన దోషులను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నబాబు వ్యవసాయశాఖను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని కులాలు, మతాలపరంగా, ప్రాంతాలపరంగా విభజించేలా కుట్ర పన్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని ధ్వజమెత్తారు. నాని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని నిలదీశారు. కొడాలి నానిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.