తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో నాటుస్థారా స్థావరాలపై అబ్కారీ అధికారులు దాడి చేశారు. సారా తయారు చేసే మొలాసిస్‌ను గుర్తించి ధ్వంసం చేశారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాలకు చెందిన మత్స్యకార గ్రామాల్లోని కొందరు.. నాటు సారా తయారీని ఓ వృత్తిగా చేసుకున్నారు. ఇతర జిల్లాలకు చెందిన దళారులు వీరికి కావలసిన ఆర్థిక సహాయం అందిస్తుండటంతో.. వీరి వ్యాపారం ఏళ్లతరబడి కొనసాగుతోంది. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులంతా కలిసి దాడిచేసినా తయారీ దారులను పూర్తిస్థాయిలో పట్టుకోలేకపోతున్నారు.
ఇటీవల జిల్లాలో మద్యం, గంజాయి, గట్కా.. ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న వారిని, వాహనాలను అధికారులు పట్టుకున్నారు కానీ.. నాటుసారా తయారీదారులు మాత్రం వీరికి చిక్కటం లేదు. ఇటీవల నాటు సారా తయారీకి ఉపయోగించే రసాయనాలు, బెల్లం, తయారీకి సిద్ధంగా ఉంచిన మొలాసిస్‌ను గుర్తించిన అబ్కారీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు.