నూతన రథం తయారీకి తీసుకొచ్చిన టేకు కలప
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం పనులు ఎవరు చేయాలన్న దానిపై ఇంకా సందిగ్థత వీడలేదు. గత ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లాంఛనంగా రథం తయారీ పనులను ప్రారంభించారు. అనంతరం నాలుగు రోజులైనా రథం తయారీ పనులు మొదలు కాలేదు. స్వామివారి రథం సెప్టెంబరు 5న అర్ధరాత్రి అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. అనంతరం వచ్చే కల్యాణోత్సవాల నాటికి నూతన రథం తయారు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా రూ. 95 లక్షలు మంజూరు చేసింది కూడా. రథం తయారీకి అవసరమైన 1330 ఘనపు అడుగుల బస్తర్ టేకు కలపను రావులపాలెంలో కొనుగోలు చేశారు. దుంగలను ముక్కలుగా కోయించి సుమారు 1000అడుగుల కలపను ఆలయం వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో రథం తయారీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న అంశంపై అధికారులకు స్పష్టత కరవైంది. ముందుగా స్వామివారి రథాన్ని గణపతి ఆచార్యుల చేత తయారు చేయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ వర్గీయులు రథం తయారీ తామే చేయిస్తామని, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని తమకే అవకాశం ఇవ్వాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. దీంతో నిర్మాణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపై సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటి వరకు ఎవరికీ వర్కు ఆర్డర్ ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.