లాఠీఛార్జ్‌లో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించిన చంద్రబాబు Chandrababu Naidu : ప్రజలలో వస్తున్న చైతన్యాన్ని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గమనించి.. అనపర్తిలో పోలీసుల్ని పురిగొల్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగ్గంపేట, పెద్దాపురంలలో లేని ఆంక్షలు అనపర్తిలోనే ఎందుకు వచ్చాయని ఆయన నిలదీశారు. ఏది ఏమైనా పోలీసులకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని తెలిపారు. అనపర్తిలో శుక్రవారం పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడి.. అనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రబాబు పరామర్శించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యమిచ్చారు. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా అందరరం కలిసి పోరాడదామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సజ్జల దర్శకత్వంలో డీఐజీ రఘురామరెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సునీల్ కుమార్, స్థానిక ఎస్పీలు అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కొంత మంది పోలీసులు కావాలనే కక్ష్యగట్టి తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. ప్రకాష్ నాయుడ్ని కావాలనే చాతీపై కొట్టడంతో.. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. బ్రిటిషు వారిపై మహాత్మాగాంధీ దండి మార్చ్ చేశారన్న చంద్రబాబు.. రాష్ట్ర పోలీసులలో కొంతమంది తీరుతో తాను అనపర్తిలో మార్చ్ చేయాల్సి రావటం బాధాకరమన్నారు.
"ప్రజలలో చైతన్యం చూస్తున్నారు. మీ మీద వ్యతిరేకతను చూస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తున్నారు. అది చూసి భయపడిపోయి మీటింగ్‌కు భంగం కలిగించటానికి పోలీసులను పురిగొల్పారు. పోలీసులకు నేను ఒకటే చెప్తున్నాను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు మీరు సహకరించకండి. చట్ట ప్రకారం పని చేయండి. నా పోరాటం రాష్ట్ర ప్రజల కోసం, బావి తరాల భవిష్యత్ కోసం." -చంద్రబాబు, టీడీపీ అధినేత
టీడీపీ కార్యకర్తలుపై పోలీసుల లాఠీ ఛార్జ్ :ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర కొనసాగింది. అందులో భాగంగా అనపర్తిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మొదట అనుమతినిచ్చిన పోలీసులు.. తర్వాత అనుమతి లేదంటూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు.. వారిపై లాఠీఛార్జ్ చేశారు. అంతేకాకుండా అనపర్తిలో నిర్వహించనున్న సభలో పాల్గొనకుండా.. ఇక్కడికి వచ్చే దారిలో బలభద్రపురం వద్ద చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు బలభద్రపురంలో పోలీసుల అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి :