ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇలాంటి దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకే మాయనిమచ్చ'

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడిపై దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయడం వైకాపా పైశాచికాలకు పరాకాష్టని మండిపడింది. తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటి ఇవాళ జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనుంది.

Chandrababu angry over attack on sc young man
చంద్రబాబు

By

Published : Jul 22, 2020, 4:44 AM IST

సీతానగరం పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డరంటూ తెలుగుదేశం మండిపడింది. ఇది రాక్షస చర్య అని.. పోలీసుల్లో కొందరు వైకాపా గూండాలుగా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే అశాంతి, అభద్రత సృష్టించడం దారుణమన్నారు. వైకాపా నేతలు చెప్పినట్లు ఆడే తోలుబొమ్మలుగా కొందరు పోలీసులు మారారని విమర్శించారు. అచ్చెన్నాయుడి ఇంటిపై వందలాది పోలీసుల దాడి, ఏలేశ్వరం న్యాయవాది ఇంటిపై అర్ధరాత్రి దౌర్జన్యం, ఇప్పుడు ఎస్సీ యువకుడి శిరోముండనం వంటి దుశ్చర్యలతో రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకే మాయనిమచ్చని పేర్కొన్నారు.

ఇకనైనా పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించి చట్టాన్ని గౌరవిస్తూ పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాలని డిమాండ్ చంద్రబాబు చేశారు. ఎస్సీలపై ఇంత బరితెగించి దాడులు, దౌర్జన్యాలు, అమానుషాలు గతంలో చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 'మా అధికారం-మా ఇష్టం' అన్నట్లుగా వైకాపా గూండాలు చెలరేగి పోతున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారని విమర్శించారు. ఇది ఎస్సీ వ్యతిరేక ప్రభుత్వమన్న చంద్రబాబు... ఏ వర్గం ఓట్లతో గద్దెనెక్కారో, వారినే మట్టుబెట్టాలని చూడటం హేయమని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటి పర్యటించనుంది. రాజమహేంద్రవరంలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని... తొలుత తెలుగుదేశం నేతలు పరామర్శిస్తారు. తర్వాత ఎస్సీ యువకుడు వరప్రసాద్ కుటుంబసభ్యులను కలిసి వాస్తవాలను తెలుసుకోనున్నారు. శిరోముండనం ఘటనలో జిల్లా అధికారులు, వారిని ఆడించిన వైకాపా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు కోరారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై ముఖ్యమంత్రి మౌనం వీడి... ప్రకటన చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండీ... 'యూనిఫాంలో ఉన్నంతకాలం ప్రజా రక్షకులుగా మెలగాలి'

ABOUT THE AUTHOR

...view details