నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణలో దివ్యరథం దగ్ధమై నేటికి ఏడాది గడిచింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కుట్రకోణం ఉందా అన్నది నేటికీ తేలలేదు. 2020 సెప్టెంబరు 5న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అప్పట్లో భక్తులు, స్వామి వాహన సేవకులు, విశ్వహిందూ పరిషత్తు, బజరంగదళ్, భాజపా, జనసేన పార్టీలతో పాటు పలు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడిచినా నేటికీ సీబీఐ రంగంలోకి దిగలేదు.
56 ఏళ్లపాటు స్వామికి వాహన సేవ అందించిన పాత రథం అగ్నికి ఆహుతవ్వడంతో ప్రభుత్వం రూ.1.10 కోట్లతో ఏడు అంతస్తుల కొత్త రథాన్ని 90 రోజుల్లో నిర్మించింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి జగన్ ఈ రథాన్ని లాగి ప్రారంభించారు. దీన్ని తాత్కాలిక రేకుల షెడ్డులోనే ఉంచారు. శాశ్వత ప్రాతిపదికన భవనాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.