ఇంటికి రాబోయే కోడలికి కొత్తబట్టలు ఇచ్చి... వివాహ సందడితో ఇంటికి వస్తున్న కుటుంబంలో... మృత్యువు విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా కోట వద్ద ఏటిగట్టు రహదారిపై పక్కనే ఉన్న చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో... యానాంకు చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు మృతిచెందారు. గురువారం రాత్రి 11 దాటినా తల్లిదండ్రులు, తమ్ముడు రాకపోవటంతో కంగారుపడిన పెద్దకుమారుడు బంధువుల ద్వారా గాలింపు చర్యలు చేపట్టడంతో ప్రమాదం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగు అధ్యాపకురాలిగా, మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు పొందిన విజయలక్ష్మి విశ్రాంత ఉపాధ్యాయుడైన ఆమె భర్త ప్రసాద్ , బ్యాంకు మేనజర్ అయిన కుమారుడు ప్రణీత్ తో కలసి కొత్తకారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రణీత్ కు జొన్నాడ బ్రిడ్జి దిగువ నుంచి యానాంకు ఏటిగట్టు మార్గం అంతగా తెలియకపోవటంతో ఎదురుగా ఉన్న మలుపులు గుర్తించక... కారును పక్కకు తిప్పటంతో చెరువులోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురూ మరణించారు.
నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం.. ఇంతలోనే...
ప్రణీత్‌కు 4 రోజుల క్రితం రాజమహేంద్రవరం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగిణితో యానాంలో పెళ్లిచూపులు కార్యక్రమం జరిగింది. గురువారం అమ్మాయికి కొత్త బట్టలు, ఇతర వస్తువులు ఇచ్చేందుకు తల్లిదండ్రులతో వెళ్లిన ప్రణీత్ ఆ కార్యక్రమం ముగించుకుని, కొత్త కారు కొనుగోలు చేసి యానాం బయలుదేరారు. జొన్నాడ బ్రిడ్జి దిగువ నుండి యానాంకి దగ్గరి దారైన ఏటిగట్టు మార్గంలో వస్తున్నారు. కారు లేటెస్ట్ వెర్షన్ కావడం, ప్రణీత్‌కు ఈ మార్గం కొత్త కావడంతో ఎదురుగా ఉండే మలుపులను గుర్తించకపోవడంతో కారు నేరుగా రోడ్డు పక్కనున్న చెరువులో పల్టీ కొట్టింది. ముగ్గురూ ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.