Buddhist Heritage Cultural Festival at east godavari: ప్రాచీన బౌద్ధారామాల పరిరక్షణ, అభివృద్ధికి సమైక్యంగా ఉద్యమిస్తామని బౌద్ధ భిక్షువులు, చారిత్రక పరిశీలకులు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ మహాస్తూపం వద్ద.. భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. బౌద్ధ భిక్షువులు అనాలయో (ఏపీ), మెత్తానంద (ఒడిశా), శ్రద్ధా రఖిత (తెలంగాణ), పన్యార్ జ్వాత (మయన్మార్), సుందర, విఛఖణ, విచార తదితరులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. బౌద్ధ సన్యాసులు.. 130 మీటర్ల బౌద్ధ పంచశీల పతాకంతో వన్నెపూడి వద్ద జాతీయ రహదారి నుండి కొడవలి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం 110 అడుగుల ఎత్తుగల ధనకొండపై ఉన్న బౌద్ద క్షేత్రం చేరుకొని.. అక్కడ బుద్ధ వందనం, త్రిరత్న గుణవందన, దమ్మప్రవచనం, పుణ్యానుమోచన వంటి పూజలు నిర్వహించారు.
బౌద్ధారామాలు ఆక్రమించి మైనింగ్ తవ్వకాలకు యత్నిస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలు, విద్యాలయాలు, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని బౌద్ద సన్యాసులు కోరారు. వారసత్వ సంపద పరిరక్షణ, మైనింగ్ మాఫియా నుంచి బౌద్ద అరవం ఉన్న ధనకొండ.. దాని పరిసరాలను రక్షించుకోవడంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.