తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదాన పథకం ద్వారా పులిహోర పంపిణీ ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో సడలింపుల తర్వాత భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే నిత్యాన్నదానం ద్వారా అన్నప్రసాదం పంపిణీ మాత్రం ప్రారంభించలేదు.
మరోవైపు.. కొండపై ప్రైవేట్ క్యాంటీన్లు సైతం తెరవలేదు. ఈ కారణంగానే.. భక్తులకు అల్పాహారంగా పులిహోర అందించాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రస్తుతం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అల్పాహారంగా పులిహోర అందిస్తారు. కొన్నాళ్ల తర్వాత భోజన సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.