కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు నిరీక్షణలు కొనసాగుతున్నాయి.ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడుస్తున్నా,ఆచూకీ లేకుండా పోయిన వారి కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద...మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు.గోదావరి తీరంలో వివిధ చోట్ల లభిస్తున్న మృతదేహాలు,గల్లంతైన వారివనే అనుమానంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు.ఇప్పటి వరకూ36మృతదేహాలు లభ్యం కాగా,మరో15మంది జాడ తెలియాల్సి ఉంది.తాజాగా పట్టిసీమ వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు మరోసారి రాజమహేద్రవరం సబ్ కలెక్టర్ మహేశ్ కుమార్ ను కలిశారు.తమ వారి జాడను త్వరగా తెలియజేయాలని విన్నపించారు.బోటు వెలికితీయాలని బాధితులు వేడుకున్నా,అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతుందే తప్పా..బోటును కనీసం కదిపేందుకైనా ప్రయత్నించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కొంత మంది మత్స్యకారాలు బోటును వెలికితీస్తామని చెప్పినా,మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే అధికార్లు అనుమతిఇవ్వడంలేదని భావిస్తున్నారు.