Dhavaleswaram Blade Batch : పవిత్ర గోదావరి చెంతన పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ధవళేశ్వరంలో కొన్నేళ్లుగా బ్లేడు బ్యాచ్ ఆగడాలు పెరుగుతున్నాయి. మత్తుకు బానిసైన యువకులు హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. కంచరలైనులో తాపీ పని చేసే రాజేశ్ అనే యువకుడిని ఓ మైనర్ సోమవారం డబ్బుల కోసం మద్యం మత్తులో కత్తితో పొడిచి నడిరోడ్డుపై హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన మైనర్ బాలుడు అప్పటికే 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. డబ్బుల కోసం గొడవపడి మరో ఇద్దరితో కలిసి రాజేశ్‌ను హతమార్చడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. గంజాయి, నాటుసారాకు బానిసైన బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"తెల్లవారిందంటే ఏదో పని కోసం బయటకు వెళ్తూనే ఉంటాము. బయటకు వెళ్లకపోతే పూట గడవని బతుకులు మావి. ఇలా బ్లేడు బ్యాచ్ హత్యలకు పాల్పడుతున్నారు. మా దగ్గర మద్యాన్ని, గంజాయిని అరికట్టండి. మద్యం దుకాణాలు ఇక్కడి నుంచి తొలగించమని వేడుకుంటున్నాము." -స్థానికురాలు
"బ్లేడు బ్యాచ్ వల్ల భయపడిపోతున్నాము. మాకు వారి వల్ల భయంగా ఉంది. రాత్రి ఒంటరిగా కనపడితే దాడులు చేస్తున్నారు. ఇటీవల హత్యకు గురైన యువకుడి తల్లి బాధపడుతోంది. అతను ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు." --స్థానికురాలు