సామాజిక మాధ్యమాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ లైకులు, షేర్లు చేసిన వారందరినీ అరెస్ట్ చేసినట్లయితే రాష్ట్రంలో జైళ్లు సరిపోవని డీజీపీ గుర్తుపెట్టుకోవాలని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో డీజీపీ భోగి రోజు ఒక మాట.. కనుమ రోజు మరో మాట చెప్పటం పోలీస్ వ్యవస్థ స్థాయిని తగ్గించడమే కాక.. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని తగ్గించే విధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ కేవలం వైకాపా జాగీర్లా ఉందని రవికిరణ్ మండిపడ్డారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు మనస్థాపం చెంది సామాజిక మాధ్యమాల్లో హిందువులు తమ ఆవేదనను తెలిపితే... దాన్ని కూడా ప్రభుత్వం తప్పుపట్టి మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారంటూ బాధితుల గొంతు నొక్కేస్తున్నారని రవికిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తప్పుగా కనిపిస్తుంటే మరీ మంత్రి కొడాలి నాని హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు ఎందుకు తప్పుగా కనపడటం లేదని ప్రశ్నించారు.