ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

అంతర్వేది ఘటన సహా హిందూ ఆలయాలపై దాడులు, తమ నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ భాజపా పిలుపునిచ్చిన 'చలో అమలాపురం' కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యనేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. అమలాపురంలో ధర్నాకు దిగిన వారిని అరెస్ట్‌ చేశారు. పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని భాజపా నేతలు మండిపడ్డారు.

భాజపా చలో అమలాపురం యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం
భాజపా చలో అమలాపురం యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

By

Published : Sep 18, 2020, 9:45 PM IST

భాజపా చలో అమలాపురం యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

అంతర్వేది రథం దగ్ధం, తమ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ భాజపా తలపెట్టిన చలో అమలాపురాన్ని పోలీసులు భగ్నం చేశారు. గురువారం సాయంత్రం నుంచే ఆ పార్టీ ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. కోనసీమలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున చలో అమలాపురానికి అనుమతి లేదని వారిని నిలువరించారు. తాడేపల్లి కరకట్ట వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహనిర్బంధం చేశారు. ఆయనను విడుదల చేయాలంటూ భాజపా శ్రేణులు ధర్నా చేపట్టాయి.

ఎక్కడిక్కడ నిర్బంధం

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో గృహనిర్బంధం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హిందూ ఆస్తులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. మతమార్పిళ్లు యథేచ్చగా జరుగుతున్నాయన్నారు. అమలాపురంలో ఉదయం నుంచే 500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. దుకాణాలన్నీ మూతపడగా ఇతర ప్రాంతాల నుంచి పట్టణంలోకి ఎవరూ ప్రవేశించకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అమలాపురంలోని గడియార స్తంభం కూడలి వద్ద ధర్నా చేపట్టేందుకు యత్నించిన భాజపా ఎమ్మెల్సీ మాధవ్, నాయకురాలు యామినీ శర్మను అదుపులోకి తీసుకున్నారు.

కేంద్రానికి ఫిర్యాదు

అంతర్వేది ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ చలో అమలాపురం కార్యక్రమానికి వెళ్లిన తనను కారణం లేకుండా అరెస్టు చేసి దాదాపు 20 గంటలు నిర్బంధించి తిప్పారని, తన హక్కులకు భంగం కలిగించిన వారిపై భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి జగన్ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తుందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

భాజపా, జనసేన నిరసన

తణుకులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గృహనిర్బంధాలకు వ్యతిరేకంగా స్థానిక నేతలు ధర్నా చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సహా పదిమంది భాజపా నేతలను అదుపులోకి తీసుకుని జనసేన నేత చలమలశెట్టి రమేష్ ఇంటికి తరలించి అక్కడ గృహనిర్బంధంలో ఉంచారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా, జనసేన నేతలు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా కారంచేడులో మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని గృహనిర్బంధం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవట్లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. అమలాపురం వెళ్తున్న తమను నిలువరించడంపై ఆయన తిరుపతిలో ధర్నా చేపట్టారు. దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ నేతల అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో రాస్తారోకో నిర్వహించిన స్థానిక నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇదీ చదవండి :అన్ని కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details