రోడ్డుపైన ఓ వృద్ధురాలు కుప్పకూలితే కనీసం కన్నెత్తయినా చూడలేదు అక్కడి జనం. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనా భయంతో గడప దాటలేదు. ఫలితంగా ఆమె మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అమానుష ఘటన జరిగింది. పట్టణానికి చెందిన నాగమణి స్టువర్ట్పేటలో అస్వస్థతకు గురై రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందారు. ఇది చూసినప్పటికీ ఏ ఒక్కరూ కరోనా భయంతో దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. విషయం తెలుసుకుని అధికారులు వచ్చినప్పటికీ... మృతదేహం వద్దకు వెళ్లలేదు. మృతురాలి వివరాలు సేకరించి.. ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.