ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏటీఎం కార్డులు మార్చి... రూ.38 వేలు కొట్టేశాడు - తూర్పు గోదావరి క్రైమ్ వార్తలు

ఏటీఎంలో దొంగతనాలు ఇప్పుడు... ఓ నయా తంత్రం. మాగ్నస్టిక్ స్టిప్​తో ఏటీఎం కార్డులను క్లోన్​ చేసి మనకు తెలియకుండానే మన ఖాతాలోని నగదును కేటుగాళ్లు మాయం చేయగలరు. ఇప్పుడీ దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏటీఎంలలో డబ్బు తీసుకోవడం తెలియని వారిని లక్ష్యం చేసుకుని.. సాయం చేస్తున్నట్లు నటిస్తూ నిందితులు పిన్​ వివరాలు సేకరిస్తారు. క్షణాల్లో మన కార్డు మార్చి.. నకిలీ కార్డు మన చేతిలో పెడతారు. ఈ ఏటీఎంలో డబ్బు లేదని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. ఇంకేముంది.. క్షణాల్లో మన ఖాతా ఖాళీ.. ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగింది.

Atms stolen by unknown person in p.gannavaram
ఏటీఎం కార్డులు మార్చి... రూ.38 వేలు కొట్టేశాడు

By

Published : Jan 28, 2020, 9:39 AM IST

ఏటీఎం కార్డులు మార్చి నగదు దోచేసిన ఆగంతుకుడు
సాయం చేస్తున్నట్లు నటించిన ఓ అపరిచిత వ్యక్తి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఎస్​బీఐ ఏటీఎంలో ఇద్దరు ఖాతాదారులను బురిడీ కొట్టించి రూ.38 వేలు కాజేశాడు. పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికి చెందిన గోగి నాగలక్ష్మికి స్థానిక ఎస్‌బీఐ, లంకలగన్నవరం గ్రామానికి చెందిన యర్రంశెట్టి వెంకటేశ్వరరావుకు ఆంధ్రాబ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వారికి ఆయా బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు ఉన్నాయి. వీరు సోమవారం డబ్బులు తీసుకునేందుకు స్థానిక ఎస్‌బీఐ ఏటీఎంకు వచ్చారు. నాగలక్ష్మి, వెంకటేశ్వరరావు ఏటీఎంలో ఉండగా అక్కడ ఒక వ్యక్తి అటు ఇటూ తిరుగుతూ బిజీగా ఉన్నట్టు కనిపించాడు. నాగలక్ష్మి కుమారుడిని ఎత్తుకుని ఏటీఎంకు వెళ్లింది. ఏటీఎం ఉపయోగించడం తెలియని ఆమె.. లోపల ఉన్న గుర్తుతెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి పిన్‌ నెంబరు చెప్పింది. అదే విధంగా వెంకటేశ్వరరావు కూడా ఆ గుర్తు తెలియని వ్యక్తిని ఆశ్రయించి కార్డు ఇచ్చి పిన్‌నెంబరు చెప్పాడు. ఆ సమయంలో తన చరవాణిలో వీరివురి సీక్రెట్​ నంబర్లు రికార్డు చేశాడని బాధితులు తెలిపారు.

కార్డు మార్చి... రూ.38 వేలు చోరీ

ఇద్దరి నుంచి ఏటీఎం కార్డులు తీసుకున్న అపరిచిత వ్యక్తి ఏటీఎంలో వాటిని పెట్టి నగదు లేదని తిరిగి వారికి కార్డులు ఇచ్చేశాడు. ఇక్కడే వారిని ఆ వ్యక్తి బురిడీ కొట్టించాడు. వీరి కార్డులను రెప్పపాటు కాలంలో మాయం చేసి వేరే కార్డులు ఇచ్చాడు. నాగలక్ష్మికి ఎస్‌బీఐ, వెంకటేశ్వరరావుకు ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కార్డులు ఇవ్వటంతో అవే వారి కార్డులని వారు నమ్మారు. ఏటీఎంలో డబ్బులు లేకపోవటంతో నాగలక్ష్మి అక్కడే ఉన్న ఎస్‌బీఐ బ్రాంచి లోపలకు వెళ్లి ఆ కార్డును ఇచ్చింది. ఈ కార్డు ఆమెది కాదని, పనిచేయటంలేదని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అదే విధంగా వెంకటేశ్వరరావు ఆంధ్రాబ్యాంకుకు వచ్చి పాసు పుస్తకం ద్వారా రూ.10 వేలు డ్రా చేసుకున్నాడు. ఇంకా అతని ఖాతాలో రూ.18 వేలు ఉండాలి. మిగిలిన నగదు లేదు. బాధితులు సంబంధిత బ్యాంకులకు ఆరా తీయగా అపరిచిత వ్యక్తి వీరి నుంచి కాజేసిన ఏటీఎం కార్డులను ఉపయోగించి.. జి.పెదపూడి ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు తేలింది. నాగలక్ష్మి ఖాతా నుంచి రూ.20 వేలు, వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ.18వేలు కలిపి మొత్తం రూ.38 వేలు కాజేశాడు. తాము మోసపోయామన్న విషయం తెలుసుకుని బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరి ఏటీఎం కార్డులను బ్యాంకు అధికారులు బ్లాక్‌ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజీలను సేకరించి నిందితుణ్ని పట్టుకుంటామని ఎస్సై జి.హరీష్‌కుమార్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details