Asha workers protest: కొవిడ్‌తో చనిపోయిన ఆశాల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కనీస వేతనాలు చెల్లించాలని, పని ఒత్తిడి తగ్గించాలని, పదవీవిరమణ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తూ.. ఆశా కార్యకర్తలు తలపెట్టిన ఆందోళన రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. సుందరయ్యభవన్‌కు చేరుకున్న వీరంతా ప్రదర్శనగా రావడంతో పోలీసులు ఇంద్రపాలెం కూడలి వద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. వాటిని తోసుకొని కలెక్టరేట్‌వైపు దూసుకొస్తున్న కార్యకర్తలను నిలువరించే క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో చేతి గాజులు పగిలి పలువురికి రక్తస్రావమవగా.. పోలీసులు ఈడ్చుకెళ్లే క్రమంలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. పెనుగులాటలో జిల్లా కమిటీ సభ్యులు పలివెల సత్యవతి సొమ్మసిల్లి పడిపోయారు. ఉషారాణికి చేతికి గాయమైంది. మరో కార్యకర్త కాలికి గాయమై విలపించారు. మహిళలపైన పురుష కానిస్టేబుళ్లు చేయి చేసుకున్నారంటూ పలువురు కార్యకర్తలు విరుచుకుపడ్డారు.
అరెస్టు చేసినవారిని ఎక్కించిన వాహనాలు ముందుకు కదలకుండా అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ కిందపడిపోయారు. కొందరు పోలీసులకూ స్వల్ప గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. ముందస్తుగా ఐదుగురు ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. పరిస్థితి సద్దుమణిగింది అనుకునేలోపు మరోసారి ఆశాలు ఇంద్రపాలెం కూడలిలో బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో వారిని వాహనాల్లోకి ఎక్కించి కలెక్టరేట్ వెనక ధర్నాచౌక్‌కు తరలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆందోళనలు సాగాయి. జిల్లా మొత్తం మీద 254 మందిని అరెస్టు చేశారు. అందులో కాకినాడలోనే 210 మంది ఉన్నారు. కొవిడ్‌తో చనిపోయిన ఆశా కార్యకర్తలకు పరిహారం, ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు జుట్టు పట్టుకుని లాక్కెళ్లారని పిఠాపురం నుంచి వచ్చిన కరుణ అనే కార్యకర్త వాపోయారు.