తూర్పుగోదావరి జిల్లాకు సమీపంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. అత్యవసర వైద్యం అందిస్తున్నా.. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మరణించారు. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 150కు మించి నమోదవుతోంది.
కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు..
పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాల మేరకు యానాంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిత్యావసర సరుకులు.. కాయగూరలు దుకాణాల వ్యాపారాలకు అనుమతించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసిన విధంగానే ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూసివేసిన మద్యం దుకాణాలను సైతం ఈ నెల పదో తేదీ వరకు తెరవకూడదని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి:
కరోనా కొత్త లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు