తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా నేడు స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. అయితే ఈ ఘట్టంలో పేరూరు వారికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఎందుకంటే...
14వ శతాబ్దంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ చక్రస్నాన ఉత్సవంలో శ్రీవారి చక్ర పెరుమాళ్లు సముద్ర గామి అయినది(సముద్రంలో కొట్టుకుపోయింది). అప్పటి మొగల్తూరు మహారాజా వారు ఊరూరా చాటింపు వేయించి తపశ్శక్తితో ఎవరైతే శ్రీ చక్ర పెరుమాళ్లును సముద్రం నుంచి తీసుకు వచ్చి శ్రీవారికి సమర్పిస్తారో వారు కోరింది ఇస్తామని ప్రకటించారు. అప్పటికే స్వామివారి చక్రం విషయం పేరూరు గ్రామంలోని నరసింహ ఉపాసకులు అయిన బ్రహ్మశ్రీ నేమాని సోమనాథ నరసింహ చైనూలు గారికి.. స్వామి వారు స్వప్నంలో కనబడి ఈ కార్యక్రమానికి నువ్వే సమర్థుడవని అన్నారట.