తూర్పు గోదావరి జిల్లా సముద్ర తీరం అంతర్వేది పల్లిపాలెం వద్ద తెదేపా ప్రభుత్వ హయాం 2015లో ఫిషింగ్ హార్బర్ మంజూరైంది. రూ.30 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్నారు. ఏడాది క్రితం వరకు 80 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 90 శాతం మేర నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు రాజోలు హెడ్ వర్క్స్ డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే మార్చి 31 నాటికి నూరు శాతం పనులు పూర్తవుతాయన్నారు.
స్థానిక ఇంజినీర్లకు సూచనలు..
ఇటీవలే బెంగళూరుకు చెందిన సెంట్రల్ యూనిట్ కోస్టల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫిషరీస్ శాఖకు చెందిన ఇంజనీరింగ్ బృందం ఈ హార్బర్‌ను పరిశీలించింది. పనుల విషయంలో అదనపు వసతులు తెలియజేస్తూ స్థానిక ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు అందించారు.
మరపడవల్లో వచ్చి..
అంతర్వేది సముద్రతీరంలో అపారమైన మత్స్య సంపద ఉంది. ఇక్కడకు కృష్ణా, విశాఖ, సబా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన గంగపుత్రులు మర పడవల్లో వచ్చి ఇక్కడే రోజుల తరబడి ఉంటూ మత్స్య సంపదని వేటాడతారు. అలాంటి వారికి అనువైన ఫిషింగ్ హార్బర్ ఇంతవరకు ఎక్కడా లేదు.