తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభిస్తున్నా… కొండపై దుకాణాలు తెరవడానికి వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ విషయంపై వ్యాపారులతో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, ఈవో త్రినాథరావు చర్చించారు.
'ఈ పరిస్థితిలో వ్యాపారం చేయలేం'
అన్నవరం దేవస్థానంలో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభిస్తున్నా… కొండపై దుకాణాలు తెరవడానికి వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయడంలేదు.
లాక్ డౌన్ తో ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయానికి గాను లీజు గడువు పొడిగిస్తామని ఈవో తెలిపారు. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెడుతుండటం, నిబంధనలతో భక్తులు రాక గణనీయంగా తగ్గే పరిస్థితుల్లో తాము వ్యాపారం చేయలేమని తెలిపారు. పూర్వపు పరిస్థితి వచ్చే సరికి కనీసం మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు దుకాణాలు తెరవబోమని వ్యాపారులు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు. వ్యాపారులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. దుకాణాలు తెరవడానికి వ్యాపారులు ససేమిరా అనడం వల్ల భక్తులకు పూజా సామగ్రి విక్రయించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై చర్చిస్తున్నారు.