ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూడు నెలల్లో ఆగమ పాఠశాల అందుబాటులోకి తీసుకురావాలి' - annavaram aagama school latest news

అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై ఉన్న ఆగమ పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంపై దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి అసహనం వ్యక్తంచేశారు. భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత వినియోగంలోకి తీసుకురాకపోతే ప్రయోజనం ఏమిటని ఆలయాధికారులను ఆయన ప్రశ్నించారు. మూడు నెలల్లో పూర్తి చేసి పాఠశాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అసంపూర్తిగా ఉన్న ఆగమ పాఠశాల నిర్మాణం
అసంపూర్తిగా ఉన్న ఆగమ పాఠశాల నిర్మాణం

By

Published : Jun 16, 2020, 5:53 PM IST

అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై ఆగమ పాఠశాల నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీనిపై దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి దృష్టిసారించి వివరాలు సేకరించారు. మూడు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సత్యగిరిపై విష్ణుసదన్‌ పక్కనే ఆగమ పాఠశాల నిర్మాణాన్ని 2016లో ప్రారంభించారు. ఈ నిర్మాణంపై అప్పట్లో వివాదం నెలకొంది. రెండు దశల్లో ముందుగా రూ.4.80 కోట్లతో నిర్మాణం చేయాలని భావించారు. ఇందులో భాగంగా మొదటి దశలో తరగతిగదులు, అధ్యాపకులు నివాసం, వంటశాల మరికొన్నింటికి రూ.2.80 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆగమ పాఠశాల నిర్మాణానికి రూ. కోట్లు వృథా చేస్తున్నారని అప్పటి ధర్మకర్తల మండలి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అన్నవరం వచ్చి పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం రూ.2.80 కోట్లతోనే పనులు పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తామని, అంతకు మించి ఎక్కువ వ్యయమైతే దేవస్థానంపై భారం లేకుండా దేవాదాయశాఖ ద్వారా చెల్లిస్తామని అప్పట్లో చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకుంది.

భవన నిర్మాణ పనులు పూర్తై పాఠశాల వినియోగంలోకి రావాలంటే విద్యుత్తు, రహదారులు, రక్షణ గోడ పనులు పూర్తికావాల్సి ఉంది. ఆయా పనులకు సుమారు రూ.1.40 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి కొన్ని పనులకు అనుమతికి పంపించారు. ఇదిలా ఉండగా ఆగమ పాఠశాలపై ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి దేవస్థానం ఈవో త్రినాథరావుతో చర్చించారు. భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత వినియోగంలోకి తీసుకురాకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రణాళికను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మూడు నెలల్లో పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారని తెలుస్తోంది. దీంతో ఈ పనులపై ఇంజినీరింగ్‌ అధికారులు దృష్టిసారించారు.

ఇదీ చూడండి:హస్తకళాకారులకు కరోనా కష్టం

ABOUT THE AUTHOR

...view details