కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ అమల్లో ఉండటం వల్ల అనేక మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా రుసుం చెల్లించి పరోక్షంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి పూజల్లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌తో స్వామి వారి దర్శనాలు నిలిపివేయగా.. స్వామివారికి నిత్యం జరిగే వ్రతాలు, కల్యాణం, ఇతర ఆర్జిత సేవల్లోనూ భక్తులు ఎవరూ పాల్గొనకుండా ఏకాంతంలో నిర్వహిస్తున్నారు. భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ ద్వారా ఆయా పూజల రుసుము చెల్లిస్తే వారి పేరుమీద పూజలు చేసి భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు.
అనేక మంది భక్తులు దేవస్థానానికి ఆన్‌లైన్ ద్వారా వ్రతాలకు రూ.500, నిత్యకల్యాణానికి రూ.1,200, అమ్మవారి చండీహోమానికి రూ.558, ఆయుష్యహోమం రూ.2 వేలు రుసుం చెల్లించి పరోక్షంగా ఆయా సేవల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 13 నుంచి ఇలా పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్రతాలు 550, నిత్యకల్యాణం 92, చండీహోమం 78, ఆయుష్యహోమానికి 54 జరిగాయి. ఇలా సుమారు రూ.6.50 లక్షల ఆదాయం సమకూరింది.