ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుల సంరక్షణకు ఇచ్చే బేబీ కిట్లు నిండుకున్నాయి. గత ఏప్రిల్ నుంచి వీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గతంలో వచ్చిన నిల్వలను అక్టోబరు వరకూ పంపిణీ చేశారు. ఆ తర్వాత ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. ప్రసవం అనంతరం బేబీ కిట్లు ఇవ్వకుండానే బాలింతలను డిశ్ఛార్జి చేసి ఇళ్లకు పంపుతున్నారు. వెరసి నిరుపేద బాలింతలు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పసిబిడ్డలకు బేబీ కిట్ల పంపిణీ ఏప్రిల్ మొదటి వారం నుంచి నిలిచిపోయింది. ఇక్కడి మాతాశిశు విభాగంలో రోజుకు 10-15 మంది పురుడు పోసుకుంటారు. కరోనా ప్రారంభం నుంచీ బేబీ కిట్లు అందక బయట కొంటున్నారు.
ఏమేం ఇస్తారు?
చంటి బిడ్డల సంరక్షణకు గత ప్రభుత్వ హయాంలో బేబీ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో కిట్టును సుమారు రూ.750 వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. బేబీ టవల్, బేబీ బెడ్, లిక్విడ్ సబ్బు, దోమతెరను ఒక సంచిలో పెట్టి అందజేస్తున్నారు. 2016 సెప్టెంబరు 20 నుంచి బేబీ కిట్ల పథకాన్ని ప్రారంభించారు. దీనిని వైకాపా ప్రభుత్వం కూడా కొనసాగించింది. వైఎస్సార్ బేబీ కిట్టు పేరుతో వీటిని పంపిణీ చేస్తున్నారు.
ఎక్కడి నుంచి వస్తాయ్
జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్తు పరిధిలోని సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులు, కాకినాడలోని జీజీహెచ్‌కు (బోధనాసుపత్రి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ప్రతినెలా బేబీ కిట్లను సరఫరా చేస్తున్నారు. చెన్నై నుంచి ఇవి నేరుగా ఈ విభాగాల కార్యాలయాలకు చేరుతున్నాయి. ఇక్కడి నుంచి ఆయా ఆసుపత్రులకు తరలించి, పుట్టిన శిశువుల సంరక్షణకు ఇస్తున్నారు.
ఎనిమిది నెలలుగా బంద్
వీటి సరఫరా జిల్లాకు ఏప్రిల్ నుంచి ఆగిపోయింది. చివరిగా ఫిబ్రవరిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, మార్చిలో జీజీహెచ్, వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రులకు వీటిని ఒక్కోచోట 1,500 చొప్పున సరఫరా చేశారు. ఇక ఏప్రిల్ నుంచి కిట్లు రాలేదు. దీంతో ఉన్న కిట్లను అక్టోబరు వరకు పంపిణీ చేశారు. కొవిడ్ నేపథ్యంలో జీజీహెచ్‌లోనే ప్రసవాలు జరగడంతో ఇక్కడ జూన్ నుంచి కిట్లు నిండుకున్నాయి. ప్రతినెలా సుమారుగా 5 వేల కిట్లు వచ్చేవి. ఇవి రాకపోవడంతో ప్రస్తుతం ఈ పథకం అమలు కావడంలేదు.
ప్రతినెలా 5 వేలకు పైగా జననాలు
జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి నెలా 5,000-6,000 సగటున జననాలు నమోదు అవుతున్నాయి. కొవిడ్ కారణంగా ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కాకినాడ జీజీహెచ్‌లోనే 90 శాతం ప్రసవాలు జరిగాయి. ఇక్కడ జూన్ నుంచి కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వందల సంఖ్యలో శిశువులకు బేబీ కిట్లు దక్కలేదు.
ఎప్పటికి అందేనో?