కాకినాడ రూరల్ తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో మంచినీటి సమస్యపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా, తెదేపా, జనసేన, సీపీఎం, ఇతర ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సీపీఎం నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. గత కొంత కాలంగా తూరంగిలో ఉన్న మంచినీటి చెరువు కలుషితమవుతుందని అజయ్ కుమార్ తెలిపారు. దీనిపై పత్రికల్లో వార్తలు ప్రచారం అవుతున్నా.. అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మురికినీటిని చెరువుకి తరలించే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని తెదేపా, జనసేన కార్యకర్తలు పేర్కొన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని చెరువును నీటితో నింపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
'భవిష్యత్‌లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటాం' - కాకినాడ తాజా న్యూస్
మంచినీటి సమస్యపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంచినీటి చెరువుపై వస్తున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వైకాపా గ్రామ అధ్యక్షులు జె. శ్రీహరి అన్నారు. పంట పొలాలకు పెట్టే క్రిమిసంహారక మందులను మురికి కాలువ నీరు మోటార్‌తో పంప్ చేయడం దారుణమైన చర్య అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు అన్నారు. సమావేశం అనంతరం చెరువు వద్దకు చేరుకున్న అఖిలపక్షం కాలువను పరిశీలించింది. ఇక్కడున్న సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వరరావుతో అఖిలపక్షం సభ్యులు చర్చించారు. పంపింగ్ చేస్తున్న మోటార్‌ను తక్షణం నిలపివేస్తామని డీఈ పేర్కొన్నారు. నాచును తొలగించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్‌లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామని అఖిలపక్ష బృందానికి ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ తటవర్తి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.