ప్రభుత్వ సిబ్బంది లంచం అడిగారని వచ్చిన ఫిర్యాదులపై అనిశా అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని గవరపేట గ్రామానికి చెందిన ఆళ్ల మంగరాజు ప్రభుత్వం రాయితీ రూపంలో అందించే రూ. 6 లక్షలు మంజూరు చేసేందుకు ఏపీవో రాజ్‌గోపాల్ తన టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా రూ.56 వేలు లంచం అడిగినట్లు బాధితులు 14400కి ఫోన్ చేసినట్లు ఏసీబీ సీఐ తిలక్ చెప్పారు.
ఈ ఘటన గత ఏడాది ఆగస్టులో జరిగిందని ఆయన తెలిపారు. నేటికీ ఉపాధి హామీ రాయితీ నిధులు మంజూరు చేయకపోవడంపై విచారణ చేపట్టామన్నారు. మండలంలోని ఎన్.సూరవరం గ్రామానికి చెందిన కొల్లు శ్రీను పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా ఆ గ్రామానికి చెందిన వీఆర్వో అరుణ రూ. 10 వేలు లంచం అడిగినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.