ప్రత్తిపాడు మండలం పోతులూరులో జరిగిన మెుదటిదశ ఎన్నికల్లో కుంచె నూకరాజు అనే అభ్యర్థి... మూడు ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఓడిపోయిన బొండి రాంబాబు అనే అభ్యర్థి... రీకౌంటింగ్ జరపాలని కోరాడు. ఈ రీకౌంటింగ్‌లో బొండి రాంబాబు 2ఓట్ల తేడాతో గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. వెంటనే.. నూకరాజు వర్గం అభ్యంతరం తెలిపింది. 5 ఓట్ల తేడా ఎందుకు వచ్చిందని అడగటంతో.. మూడోసారి కౌంటింగ్ ప్రారంభించారు. ఈసారి 6 ఓట్లు తేడాతో బొండి రాంబాబునే గెలుపొందినట్లుగా అధికారులు మళ్లీ ప్రకటించారు.
ఈ పరిణామంతో.. కుంచె నూకరాజు వర్గీయులు రోడ్డు పై నిరసన తెలిపారు. రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇళ్లకు వెళ్తున్న ఎన్నికల అధికారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకొని అధికారులను సురక్షితంగా తరలించారు. భయాందోళనల మధ్య ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.