కోనసీమలో అయిదారేళ్లుగా ముంపు బెడద రైతులను పీడిస్తోంది. ఈ సమస్య వల్ల సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు, అల్లవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ వరిసాగు మానుకుంటున్నారు. ఈసారి మరింతమంది పంట విరామం ప్రకటిస్తామంటున్నారు. కాలువలకు సాగునీరు విడుదల చేసి 15 రోజులు దాటినా కోనసీమలో నేటికీ నారుమళ్లు ఊపందుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఖరీఫ్‌లో పంట వేయకుండా వదిలేసే విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. తాజాగా ముమ్మిడివరం మండలం అయినాపురంలో మాగాం-అయినాపురం, వాడపర్రు పంట కాలువల పరిధిలోని సుమారు 200 మంది రైతులు 800 ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. ఉప్పలగుప్తం మండలం గోపవరంలోనూ ఆదే బాట అని చెబుతున్నారు.
పరిష్కారానికి చర్యలేవీ..?
ప్రధానంగా కోనసీమలో రెవెన్యూ మురుగు కాలువలు ఆక్రమణలతో దాదాపుగా అదృశ్యమయ్యాయి. ఇవి వరిచేలకు అత్యంత చేరువలో ఉంటాయి. వీటిలోంచి ముంపునీరు మిగిలిన కాలువల్లోకి చేరుతుంది. ఇవి మొత్తం ఆక్రమణలకు గురికావటంతో చేలు అత్యధికంగా ముంపు బారినపడుతున్నాయి. ఈ ఆక్రమణలను గుర్తించినా.. వాటిని తొలగించి పరిస్థితిని చక్కదిద్దలేని పరిస్థితిలో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. అయినాపురంలో వరి చేలు ముంపుబారిన పడడానికి కారణం కూడా ఆక్రమణల సమస్యే. నక్కల కాలువ, ఇరుమండ డ్రెయిన్లు ఆక్రమణల చెరలో ఉండడంతో అటుగా నీరు మళ్లకపోవడంతో అయినాపురంలోని అవుట్‌పాల్ స్లూయిజ్ పరిధిలో ముంపు సమస్య పెరుగుతోంది.
ముంపు ముప్పుతో..
ముమ్మిడివరం మండలం అయినాపురంలో ఏటా సుమారు 1200 ఎకరాల్లో వరినాట్లు వేసిన తర్వాత నెల రోజుల్లో వరదలు, వర్షాలకు చేలు నీటమునిగి నష్టపోతున్నారు. భారీ వర్షాలకు అమలాపురం-అయినాపురం డ్రెయిన్ నుంచి బ్యాక్ వాటర్ ఇక్కడకు చేరడం.. అవి గోదావరిలోకి దిగడానికి ఎక్కువ రోజులు పట్టడంతో వరిచేలు ముంపునకు గురవుతున్నాయి. మరోవైపు వరదలు వస్తే అవుట్‌ఫాల్ స్లూయిజ్ సక్రమంగా లేకపోవడంతో నీరు డ్రెయిన్‌లోకి చొచ్చుకురావడం.. తిరిగి నదిలోకి మళ్లడానికి సమయం పట్టడంతో వరిచేలు కుళ్లిపోతున్నాయి. దీంతో అన్నదాతలు నిలువునా మునిగిపోతున్నారు.
నారుమళ్ల దశలోనే..
మురుగు కాలువలు అధ్వానంగా మారడంతో ఖరీఫ్ పంట నారుమళ్లు దశలోనే ముంపు బారిన పడుతోంది. ఈ కారణంగా ఖరీఫ్‌పై ఏటా రైతుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ఏడాది రబీధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్రజాప్యం చేస్తోంది. ఇలాంటి బాధలతో రైతులు పంటవిరామం ఆలోచనకు వస్తున్నారు.- యాళ్ల బ్రహ్మానందం, కోనసీమ రైతు పరిరక్షణసంఘం అధ్యక్షుడు, బెండమూర్లంక