తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విషాదం నెలకొంది. స్థానిక సాయినగర్‌కు చెందిన పసల సూర్యప్రభాస్కర రావు.. విజయదశమి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించడానికిసమీపంలో ఉన్న సీతపల్లి వాగులో దిగాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల అతను కొట్టుకుపోయి... కిలోమీటర్ దూరంలో ఉన్న రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. మధ్యాహ్నం వాగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే మృతుడు వాగులోకి దిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంటిపెద్ద మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.