సాధారణంగా సారెను వధువు తల్లిదండ్రులు.. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పెడుతూ ఉంటారు. పెళ్లి అయిన తొలిరోజుల్లో పసుపు కుంకుమతో కలిపి సారె పట్టుకొని వధువు అత్తింటిలో అడుగుపెడుతుంది. ఆ తర్వాత చంటిబిడ్డతో మరోసారి సారె తీసుకెళ్తుంది. ఈ మధ్యలో ఆషాడం సారె కావిడ పెట్టడం గోదావరి జిల్లాల్లో పరిపాటి.పది రకాల స్వీట్లు, 50 కేజీలు హాటు.. ఆ సీజన్లో దిరికే నాలుగైదు రకాల పండ్లు.. బెల్లంతో తయారుచేసిన చలివిడి.. సారె బిందెలను కావెళ్లు పెట్టి కొత్త పెళ్లి కూతురుని అత్త వారి ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తారు. ఆషాఢమాసంలో వియ్యంకుడు వియ్యాల వారికి సారె పంపించటం.. కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఆ విధంగా వచ్చిన సారె టన్నులకొద్దీ ఉంటే ఆశ్చర్యపోతారు కదా..!
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన తోట రాజు దంపతుల కుమారుడు పవన్ కుమార్కు.. రాజమండ్రికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో గత నెలలో వివాహం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మాయి తండ్రి వియ్యాల వారికి... ఐదు వాహనాలలో 100 రకాల స్వీట్లు, 50 రకాల హాట్లు,100 కేజీల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు,10 రకాల కూరగాయలు, వెయ్యి కేజీలు బతికి ఉన్న చేపలతో పాటు పది మేకలు, పాతిక కోళ్లు.. పంపించి వియ్యాలవారిని అబ్బురపరిచాడు.. . మరో విశేషం ఏంటంటే రెండు మేకలు చెవులకు బంగారు రింగులు ఉన్నాయి.
నూతన వధువు సారె తీసుకురావడమనే ఆచారం తమ దగ్గర ఎప్పటి నుంచో ఉందని వరుడి తండ్రి యానాంకు చెందిన తోట రాజు తెలిపారు. అయితే వియ్యంకుడు పంపిన భారీ ఆషాఢం సారె కావిడి ఇంతవరకూ ఎవరూ పంపించి ఉండరంటూ సంతోషం వ్యక్తం చేశారు.