తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. జొన్నాడ గ్రామానికి చెందిన పాములు సత్తయ్య అనే రైతు పొలం నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతూ.. జాతీయ రహదారి దాటుతుండగా ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం వైపు నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఓ వ్యాన్ ఢీ కొనడంతో సత్తెయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి.
హైవేపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ సిబ్బంది బాధితుడిని వెంటనే అంబులెన్స్ సాయంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు.