72ఏళ్ల వ్యక్తి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు AB ROLLER EXCERCISE: వాడపల్లి వెంకట సత్యనారాయణ.. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి నివాసి. 72 ఏళ్ల వయస్సులో అతి సునాయాసంగా ఆబ్‌రోలర్‌పై నిత్యం సాధన చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఆటలంటే సత్యనారాయణకు అమితమైన ఇష్టం. పెద్దైన తర్వాతా క్రీడలంటే మరింత ఆసక్తి పెరిగింది. కుటుంబ పోషణకు బైక్‌పై ఊరారా తిరిగి గృహోపకరణాలు అమ్ముతారు. సాయంత్రమైతే ఆటల్లో లీనమై పోతారు.
ఆరోగ్యం కోసం 3 దశాబ్దాల క్రితం నడకను ప్రారంభించారు. స్థానిక వ్యాయామ అధ్యాపకుడు రవీంద్రనాథ్.. సత్యనారాయణ పట్టుదలను గమనించి పరుగులో మెళకువలు నేర్పారు. రాష్ట్ర స్థాయి పరుగు పోటీల్లో పలు సార్లు పాల్గొనడంతో పాటు.. అండర్-50 పరుగు పోటీల్లో జాతీయ స్థాయికి సత్యనారాయణ మూడుసార్లు ఎంపికయ్యారు.
నాలుగేళ్ల క్రితం సత్యనారాయణకు బైక్ ప్రమాదం జరిగింది. దీంతో పరుగుకు బ్రేక్ పడింది. అయినా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆబ్‌రోలర్‌ను ఎంచుకొని ముమ్మర సాధన చేశారు. అలా 8 నిమిషాల్లో 262 సార్లు రోలింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించున్నారు. ఆబ్‌రోలర్‌పై త్వరలోనే ప్రపంచ రికార్డునూ నమోదు చేస్తానని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యువకులు ఆబ్‌రోలర్ అంటేనే ఆమడ దూరం వెళ్తారని.. అలాంటిది సత్యనారాయణ స్వయం కృషితో రికార్డు సాధించారని కోచ్ రవీంద్రనాథ్ చెబుతున్నారు. తండ్రి స్ఫూర్తితో తమ పిల్లలకూ క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని సత్యనారాయణ కుమార్తె తెలిపారు. సత్యనారాయణ స్ఫూర్తితో చుట్టుపక్కల పిల్లలు చాలా మంది వ్యాయామంపై ఆసక్తి పెంచుకున్నారని.. జిమ్‌లో శిక్షణ తీసుకుంటున్న పలువురు చెబుతున్నారు. యువత తప్పనిసరిగా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సత్యనారాయణ సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: