కరోనా ప్రభావంతో చెన్నై జంతు ప్రదర్శనశాలలో ఓ సింహం మృత్యవాతపడటం.. హైదరాబాద్ జంతప్రదర్శనశాలలో సింహాలకు కరోనా సోకడం వంటి సంఘటనలతో తిరుపతి జంతుప్రదర్శనశాల అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జూలో ఉన్న జంతువులు, పక్షులు, సరీసృపాలను కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాలగా గుర్తింపు పొందడంతో పాటు.. 89 రకాలకు చెందిన 1100 జంతువులతో సందర్శకులకు ఆకట్టుకొంటున్న ఎస్వీ జంతుప్రదర్శనశాలలో జంతువులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
సందర్శకులను పూర్తిగా నిలిపివేసిన అధికారులు జంతువులకు పెట్టే ఆహార పదార్థాల ద్వారా కరోనా సంక్రమించకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. పక్షులకు వేసే కాయగూరలు, ఆకు కూరలతో పాటు శాఖాహారానికి సంబంధించిన ఇతర వస్తువులను తొలుత ఉప్పునీటితో, తర్వాత మంచినీటితో శుభ్రం చేస్తున్నారు. మొదటి దశ కరోనా సమయం నుంచి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నప్పటికీ రెండో దశ సమయంలో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.