TTD CHAIRMAN: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం
13:01 August 08
వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. మళ్లీ ఆయన్ను తితిదే ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తితిదే బోర్డు పదవీకాలం ఇటీవలే ముగియగా..కొత్త పాలకమండలి ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండోసారి తితిదే బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి విముఖత చూపడంతో మరొకరి నియామకం కోసం కసరత్తు జరిగింది. బోర్డు లేకపోవడంతో దేవస్థానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా కార్యకలాపాల కోసం ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారని, లేదంటే రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ వెళ్తారనే ప్రచారమూ వైకాపాలో విస్తృతంగా జరిగింది. ఈ పదవులు వచ్చేసరికి మరికొంత సమయం పడుతుండటం..ఇదే సందర్భంలో తితిదే ఛైర్మన్ పీఠానికి పోటీ ఎక్కువగా రావడంతో తితిదే ఛైర్మన్ నియామకంపై సీఎం పునరాలోచనలో పడ్డారని తెలిసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో తితిదే ఛైర్మన్ పీఠానికి వైవీ సుబ్బారెడ్డినే తిరిగి నియమిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకే రెండోసారి తితిదే ఛైర్మన్ పీఠం కట్టబెట్టారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రెండేళ్లపాటు వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. పాలక మండలి సభ్యుల నియామకంపైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. త్వరలోనే బోర్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రకటించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి