YSRCP Leaders Supporting Red Sandalwood Smugglers: ఎర్రచందనం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలకే ప్రత్యేకమైన సహజ వనరు! ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి అదే చోదక శక్తిగా మారింది. ఆ రెండు జిల్లాల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లర్లే బలం, బలగం! ఎలాగంటారా? దుంగల దొంగలే వైసీపీకు ఆర్థిక ఆక్సిజన్ అందిస్తున్నారు. స్మగ్లింగ్ సొమ్మునే తమ రాజకీయ ఉన్నతికి పెట్టుబడిగా పెడుతున్నారు.
స్మగ్లర్లకు, వైసీపీకు మధ్య సంబంధాలు క్రమంగా ఎన్నికల అనుబంధంగా మారిపోతున్నాయి. దానికి నిదర్శనం విజయానందరెడ్డి! ఈయనో పేరుమోసిన స్మగ్లర్! ఒకప్పుడు సాధారణ కారు డ్రైవర్. ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగి కోట్లకు పడగలెత్తారు! 2014లో అప్పటి ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించటంతో కొన్నాళ్లు జైల్లో గడిపారు! గత ఎన్నికల్లో కొందరు వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డే పెట్టుబడి పెట్టారనే ఆరోపణలున్నాయి!
వైసీపీ అధికారంలోకొచ్చాక విజయానందరెడ్డికి జగన్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు! 2024 అసెంబ్లీ ఎన్నికలకు చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అధికారం అండతో గత నాలుగున్నరేళ్లుగా విజయానందరెడ్డి తన అనుచరుల ద్వారా అడ్డూఅదుపులేకుండా స్మగ్లింగ్ నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం
కొల్లం గంగిరెడ్డి! అందరికీ అంతర్జాతీయ స్మగ్లర్‌గానే తెలుసు. కానీ రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైసీపీకు ఆయనే పెద్దదిక్కు. నియోజకవర్గంలో పార్టీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. 2014లో తెలుగుదేశం అధికారంలోకొచ్చక నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు పారిపోయాడు గంగిరెడ్డి. అంతర్జాతీయ స్మగ్లర్లతో ఉన్న సంబంధాలు అడ్డు పెట్టుకుని బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్, కౌలలాంపూర్ వంటి దేశాల్లో దాదాపు 10 నెలలు తలదాచుకున్నాడు!
చంద్రబాబు హయాంలో ఏపీ పోలీసులు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయించారు. అలా శ్రీలంకకు మకాంమార్చుతూ మారిషస్ విమానాశ్రయంలో చిక్కిన గంగిరెడ్డిని ఏపీ పోలీసులు పట్టుకొచ్చి జైల్లో వేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక గంగిరెడ్డి దందాలకు అడ్డేలేదు! అధికారం చేతుల్లో ఉండటంతో నాలుగున్నరేళ్లుగా అనుకున్నది అనుకున్నట్లుగా నడిపిస్తున్నాడు. ఇప్పటికే అనేక మంది ఎర్ర స్మగ్లర్లు వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా మారిపోయారు.