కులమతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వైకాపాకు తిరుపతి ప్రజలు అండగా ఉండాలని.. ఆ పార్టీ నేతలు ప్రజలను కోరారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు.. పార్టీ అభ్యర్థి అయిన గురుమూర్తిని అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్తలతో శ్రీకాళహస్తిలో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతి ఎంపీ అభ్యర్థి ప్రకటించిన రోజునే విజయం ఖాయమైందని మంత్రి నారాయణస్వామి అన్నారు. దిల్లీకి వినిపించేలా అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
సామాన్య కార్యకర్తలకు సైతం వైకాపాలో పెద్దపీట లభిస్తుందని.. దీనికి నిదర్శనం గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇవ్వడమేనని మంత్రి కన్నబాబు అన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించి.. ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలన్నారు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా చేయాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. సామాన్య కార్యకర్త అయిన తనకు సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి అన్నారు. గెలిపిస్తే తిరుపతి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.